Sunday, September 18, 2016

అనృతం కురిసిన రాత్రి
అంతా ఆదమరచి నిద్రిస్తుంటే
అమృత ఘడియలన్నీ
విష ఫూత్కారాలను వెలువరిస్తూ
తమ దుశ్శీలాన్ని ప్రకటించుకోవాలని
ప్రపంచమంతటినీ
భయభ్రాంతుల ఒడిలోకి చేర్చి
పరాకును చిత్తగిస్తున్నట్లు నటిస్తున్నాయి..
[అభ్యుదయ కవి తిలక్ కు క్షమాపణలతో]




అమృతం ఇంటిపట్టున తలదాచుకున్న సమయాన.
=============================================


వేసవి వేడిమినంతా
దినకరుడు ధరణీతలంపై
ఏకధాటిగా విస్తరింపజేసినవేళ
 అతడొక్కడలా ఇంటిపట్టునేవుండి
ఆరగారంగా అదోఇదోతిని,తాగుతూ
ఒక పుస్తకంపురుగులా పరిణామంజెంది
దీపపుకాంతిలోగూడా దేదీప్యమానంగా
వెలిగి వేడిమికిదూరంగా మంచిపుస్తకం చెంతన
మనసును చల్లబరుచుకుంటూ, మౌనరాగాన్నాలపిస్తున్నాడు..


బయట వాతావరణమంతా ఒక్కసారిగా మారిపోయింది..
ఉరుములూ మెరుపులతో జనావళిని భయకంపితంజేయడం మొదలెట్టింది..

అప్పటిదాకా ఒక వలయంలా ఏర్పడి రాజ్యపాలనంజేసిన నిశ్శబ్దం
వరుణదేవుడి కరుణకు చాలా దూరం విసిరివేయబడి..అల్లకల్లీఓలం వైపు అడుగులువేయడం మొదలెట్టింది..

అతనుమాత్రం ఏమాత్రం చెక్కుచెదరకుండా పట్టుకున్న పుస్తకాన్ని
పట్టువదలని విక్రమార్కునిలా ఆ కావ్యగత పరీమళాలను
ఆస్వాదించడంలో మునకలేస్తూ మురిసి ముక్కలయిపోతున్నాడు..
అతని చుట్టూ,పాతకొత్తలమేలుకలయికగా అమృతం కురిసినట్లనిపించింది..

పుస్తకాన్ని ఔపోసనపట్టడంలో నిమగ్నమవడం పూర్తయాక
అర్ధరాత్రివేళ ఆనందమయుడై ఒక వెలుగువెలుగుతూ
సాహిత్య ప్రస్థానంలో సౌజన్యశీలియై ప్రకాశిస్తున్నాడు..

తనకు నచ్చినపనిలో ఆపాదమస్తకం మునిగితేలడంలోని అపురూపమైన ఆసక్తికి ఆశ్చర్యపోవడం
ఆమె వంతై పెదవి అంచులమాటున చిరునవ్వులపూలు పూయడం అవిడకు అనుభవంలో
కొత్తనిపించకపోవడం అసలు సిసలు అందమె ఆనందమని మురిసిపోవడానికి మూలాధారమై నిలిచింది..
================================================================

Friday, September 16, 2016

కవిత్వంపట్ల వైముఖ్యం
మనిషిని సోమరితనం వైపు
సునాయాసంగా చేర్చడం ఖాయం..

ముదిమితనం మనిషిని
ముద్దుపెట్టుకోవడం మొదలయినప్పుడు
ఒంటరితనపు చీకట్లు ఒక్కొక్కటిగా
ముసురుకోవడం మొదలెట్టినప్పుడు
ఎంతఖర్చుకయినా వెనుకంజవేయకుండా
వైద్యంచేయించినా కూడా రోగం నిదానించనప్పుడు
శేషజీవితం శుభప్రదంగా సాగాలనుకుంటే
కవిత్వపఠనమొక్కటే నిజమైన తరుణోపాయమని
ఇట్టే అర్ధమయిపోతుంది..
నేలకు రాలిపడిన నీటిబిందువును తిరిగి
హస్తగతం చేసుకోవడం అసాధ్యమేనని తెలుసు..

తెలిమబ్బులవెంట ఆశాజనకంగా పరుగులు తీయడం
ఎండమావులపట్ల ఎడతెగని విశ్వాసాన్ని ప్రకటించడమే గదా!!

సోమరిపోతులకు కాలాన్నెలా వృధాగా ఖర్చుచేయడమో తెలుసు..
పసుపురంగులు దాల్చిన ఆకులు క్రిందకు పడిపోవడంకూడా తప్పదని తెలుసు..
అందుకే మౌనాన్ని ఔదలదాలుస్తూ,పురా వైభవాన్ని మరలా
పుణికి పుచ్చుకోవడమే మేలని తెలుసుకున్నాను..
కావ్య పఠనంలోనూ,కవిత్వం పట్ల రచనాసక్తిని పెంపొందించుకోవడంలోను
కాలాన్ని అమూల్యమైన సంపదగా భావించి గుర్తించడం ప్రారంభించాను..
====================================================

Thursday, September 15, 2016

ప్రభాత గీతం

---------------------
ఇవ్వాళ నానడకదారిలో
నానావిధాలైన దృశ్యాలు
కంటబడినన్ను కళవళ పెట్టాయి..


నెత్తురోడుతున్న హరిణం శిరస్సు
గుండెను గొంతులోంచి
క్రిందకు జారవిడిచింది..


కొoచం దూరం ముందుకడుగులు వేయగానే
చీమలబారు చిటుక్కుమని తగిలింది..
చెరకుముక్కను డొల్లచేయడంలో
కృతకృత్యమయ్యాయని చెప్పకయే చెప్పింది..


ప్రక్కగా వీస్తున్న పరిమళ భరిత సుమదళాల
సోయగాలు మాత్రం
 నన్ను కలత బారినపడకుండా
కాపాడగలిగాయి..


దగ్గరున్న తరువనంలోంచి వీచేగాలికి
గలగలాడుతున్న ఆకులు జీవనరాగాన్ని
ద్విగుణీకృతంచేస్తుండగా ---
అప్పుడప్పుడు నేలమీదకు రాలిపడుతున్న
 పండుటాకులుమత్రం
బ్రదుకు బాటను శిశిరానికి చేర్చకతప్పదని
హెచ్చరికచేస్తూ కదలిపోయింది..

Wednesday, September 14, 2016

నవ్వుతాలుగా----
=================
ఆ నవ్వుకు అర్ధమేమిటని?
అమయకంగా తనను ప్రశ్నించాను
ప్రభాతాన పరిమళించే పువ్వుల
అందాన్ని ఎప్పుడయినా నిలదీసి అడిగావా?
మీ అందాలకు అనుపానాలేమిటని?
పువ్వయినా , అతివ నవ్వయినా, అందాన్ని
ఇనుమడింపజేసేందుకేగాని, అడ్డ దిడ్డమైన
ప్రశ్నలతో విసుగు పుట్టించడం గొప్పకాదు..
మృదుహాసంతో తన సమాధానం
నన్నుచూసి నివ్వెరబోయింది...
=========================================

Sunday, September 11, 2016

ఔను నిన్ను గురించి
ఒక కవితను వ్రాస్తానన్న
 మాట యదార్ధమే సుమా!

బాల్యంలో స్నానాలగదిలో
నిన్ను బుసగొడుతూ భయపెట్టిన
త్రాచు పాము కధను వివరించనా?

యవ్వనంలో నీకున్న
 చలన చిత్ర వ్యామోహం
గురించి చక్కగా వివరించనా?

నడివయసు దాటాక
 నాజూకుల నజరానాలకు
వీడ్కోలు చెప్పిన నీ సౌమనస్యాన్ని
 గురించి ప్రవచించనా?

ముదిమి మీదపడుతున్న సమయానికి
నెత్తి నద్గిరోహించి స్వేదసంద్రాలను సృష్టించిన
 సూరీడులా నీ నెత్తినెక్కి నాట్యం చేసిన
అనారోగ్యాన్ని గురించిన్నీ  అమాంతంగ నిన్ను కౌగిలించిన
మృత్యువును గురించి శోకతప్త హృదయంతో విషాద
రామాయణాన్ని విపులీకరించనా?

ఔను నిన్నుగురించి ఒ కవతను రాయాలని
ఎన్నాళ్ళుగానో అడుగుతూనేఇవున్నావు..
ఎక్కడినుంచి మొదలెట్టాలో తెలియక
ఇప్పటిదాకా మిన్నకుండిపోయాను..

ప్రభాత సమయమ్నుంచి పవళింపు వేళదాకా
ప్రతిక్షణం నిన్ను గూర్చిన జ్ఞాపకాల ప్రవాహాల్లో
మునిగితేవ్లేనాకు ముందు నాసంగతి ప్రస్తావించవా అంటూ
ఎన్నెన్నో సంఘటనలు నన్ను ముసురుకుని ఊపిరాడకుండా వేధిస్తున్నయి..

యవ్వనంలో నువ్వు తళ తళ లాడుతూ మురిసిబోతున్నప్పుడు
స్నాలగదిలో తలెత్తి బుసకొట్టి భయపెట్టిన త్రాచుపాము
చేసిన హడావుడినిగూర్చి మొదలెట్టనా!!

శనివారం అనగానే సినిమా చూడాలంటూ పట్టుబట్టే నీ
మంకు పట్టునుగూరించి సవివరంగా చెప్పనా?

Friday, September 9, 2016

అదృష్టమో !
ఆశావహంకాలేని దురదృష్టమో!!
ముందస్తు అవగానంటూ ఏమీ ఏర్పడకుండానే
ఈ ప్రపంచంలోకి వచ్చి దిగబడిపోయాను..

ప్రేమించిన హృదయానికితలొంచుకుని
ముందుకు ముసిముసినవ్వులతో అడుగులు వేసాను..

ఎక్కడినుంచో ఒక ఆకాశవాణి అనూహ్యంగా
పెడబొబ్బలతో కేకలు కొనసాగిస్తూనేవున్నది..

ఇంత హడావుడిజీవితగమనంలోనూ
అకాల వసంతంలా తృప్తినిస్తున్న సంతానం..

శిశిరంలోకి తొంగిచూడనవసరం రాకుండా
అడ్డుపడుతున్నానురాగానుబంధాలు..

జరిగిన విషాదాన్నెలా సమ్యమనంతో
సర్దుకు గడుపుకోవాలోనన్నదొక్కటే
శెషజీవితంలో చివరకు మిగిలిన
జవాబుకోసం ఎదురుచూసే ప్రశ్న..
====================================

యదాలాపంగా----------------
=========================
నీవు ప్రేమానురాగాల అభివ్యక్తితో
రాసిన లేఖలన్నింటిలోనూ ఒక
రసరమ్యమైన ప్రపంచం కనులకు
చేరువవుతున్న అనుభూతి..

దూర దూర తీరాల్లోంచి వినిపించినా
నీ మృదుస్వనం నాచెవులకు ఇంపునే కలిగిస్తున్న అనుభవం..
అదేమిటో జ్ఞాపకాల వసంతాలన్నీ మావిచిగురుల మడతల్లో
తలదాల్చుకు తీరాలని తహ తహ పడుతున్నాయి..

నీలేఖల్లోని ప్రతి అక్షరం హృదయగత భావాలను వెలికిదీసుకొచ్చే
చేదలాగానే నాకనులకు ద్యోతకమౌతున్నది..

అక్కడక్కడా కొన్ని అక్షరాలు అశ్రువులనాశ్రయించాయేమో
కలగాపులగంగా తడిదుప్పటిని ఆసాంతం కప్పుకున్నట్లనిపిస్తుంది..

దూరాలను కలిపికుట్టే దివ్యాస్త్రంలానీ ప్రేమలేఖలు..
కొనగోటితో కన్నీటిచారికలను తుడుచుకుంటూ నే
నీలేఖల్లోని సారాంశాన్ని మనోగతంచేసుకునే
 ప్రక్రియలో నిమగ్నమై పోతున్నాను..
నన్ను మనసారా క్షమించు..నీలేఖాంశాలనన్నింటినీ
ఇలా బహిర్గతం చేసి నా అంతరంగ మధనాన్ని
ఆరుబయట ఆరబెట్టవలసిన విషాదం ముంచుకొచ్చినందుకు..
============================================
ప్రభాతసమయాన
మనసుకు ఆహ్లాదాన్నికలిగించే
సుప్రభాత శ్లోకమే నీవనుకున్నాను..

వసంతం వచ్చేసిందనగానే
మావిచిగురులమాటున వినిపించే
కోయిలమ్మ స్వరగానమే నీవని తలచాను..

వానలు జడివానలై వర్షించినప్పుడు
అదే నీ అనురాగామృత ధారలని
ఆహ్లాదంతో గ్రోలాను...

శరద్ హేమంతాలలో వీచే చలినెగళ్ళకు
నులివెచ్చగా కప్పుకునే ఊలు దుప్పటివని మురిసాను..

గ్రీష్మం వచ్చినా సాయంత్రానికి వీచే
మలయమారుతం నీవని గ్రహించి మృదుహాసంతో మెరిసాను..

శిశిరం అడుగిడగానే చెప్పా పెట్టకుండా పండుటాకులా
నేలకు రాలిపడతావని ఊహించలేక కృంగి కృశించాను..

Thursday, September 8, 2016

ని  'వేదన '
==============
నాకుతెలుసు నేనెంతకష్టించి స్వేదం వెలార్చినా
అది నీ కంటికి హ్రస్వమై సాక్షాత్కరిస్తుందని
వర్షాభావాన్ని ముందస్తుగానే ఊహించి నేను
కుంభ వృష్టిలా అనురాగామృతాన్ని వర్షించినా
అదికేవలం ఒక బట్టతడుపువానగానే నీకు స్పృశిస్తుందని
వృత్తలేఖినిలా అనునిత్యం నిన్నంటిఉపెట్టుకుని
నీచుట్టూ నిరంతరం పరిభ్రమించినా అది కేవలం
ఒక కంటి తుడుపు ప్రదక్షిణగా నీ మదిలో సూక్ష్మరూపాన్నావహిస్తుందని..
అయినా భ్రమరకీటక న్యాయాన్ని నా మదిలో
పున ప్రతిష్టింపజేసుకుని నా మనోభీష్టాన్ని నెరవేర్చుకునేదిశలో
కృతకృత్యనై కునారిల్లకుండా ఈ భువిపై మిగిలిపోతానని..
============================================

Wednesday, September 7, 2016

విహ్వలమైన క్షణంలో
------------------------------రావెల
అరవయ్యో పడిదాటాకపడిదాటాక
అకస్మాత్తుగా వాటేసుకున్న
ఒంటరితనానికి దాసోహమన్నాను..
రాత్రంతా ఎడతెరిపిలేకుండా
కురుస్తున్న కుంభవృష్టిలాంటి వర్షం
నన్నుమాత్రమేగాక ఇంట్లో
వెలుగుతున్న ఒకేఒక్క కొవ్వొత్తినికూడా
గజ గజ వణికిస్తున్న వైనం..
ఉరుములూమెరుపులూ వూరికే రావని
నన్ను అనుస్యూతంగా భయకంపితుడిని
గావించడానికేనని
ఇట్టే అర్ధమై పోయింది...
[ఒక జపనీస్ 8 వశతాబ్దపు కవిత ఆధారంగా]
హితోక్తి
=======

అక్షరం ప్రవహిస్తున్నవేళ అంతటా
ఆనందం తాండవనృత్యం గావిస్తున్నది..
సుమసౌరభమౌ సుందరపరీమళాలు
సువిశాలంగా విస్తరిస్తూ ప్రభవిస్తున్నవి.



అమ్మ, ఆవులతో మొదలైన వర్ణసముదాయం
మాతృ స్థానానికి మనసారా నమస్కరిస్తున్నది..
కమ్మనైన సంస్కృతీసంప్రదాయాల
వారసత్వాన్ని కనులవిందుగా వినిపిస్తున్నది..
వినమ్రంగా విశదీకరిస్తున్నది..

ఉడుతలు చెట్లకొమ్మలపై ఊయలలూగుతూ పలురకాల
కాయలను కొరికి కొరికి తమౌఉచ్చిష్టమే జగత్సర్వమని ఉపదేశిస్తున్నది..
ఏలుకనెక్కిన దైవానికి ప్రతి శుభకార్యంలోనూ
అగ్రసనాధిపత్యం వహించే అదృష్టానికి నోచుకుని
ప్రధమ తాంబూలాన్నందుకుని తనివితీరా మనలకు
ఆశీర్వాదాల నందిస్తున్నది..
ఏనుగునెక్కిన కవివరులంతా ఇక్కడి సాహితీలోకంలో
ప్రాత:స్మరణీయులై కంఠోపాఠంగా తమ పద్యాలను వల్లెవేసుకునే
అదృష్టానికి మనమoతా నోచుకునేలాచేస్తున్నారు..


ఒకాడొక్కడిగానే ఉంటూ ఓటికుండల్లా మారకూడదని
 పెద్దలమాటలనుఔదల దాల్చి ఉద్వాహప్రక్రియతో ఉత్సాహాన్ని
 తనివితీరా తమలోనింపుకుంటూ
తమ పరిసరాలకు కూడా దానిని వ్యాప్తి చెందించమని
 చెప్పకయే చెప్పుతున్నది..

అమ్మా, నాన్నా ,పిన్నీ , బాబాయ్ అక్కా,బావా , మామా, అత్తా
అని పిలుచుకుంటూ మన ఆత్మీయనురాగాల అనుబంధాలను
అనుభూతిప్రధానంగా మలచుకుందాం!


అంత: కరణను అనునిత్యం ప్రక్షాళనగావించుకుంటూ
ఆదర్శప్రాయంగా జీవితాలను క్రమానుబద్ధంగా మలచుకొమ్మని
సుఖశాంతులతో ప్రవర్ధమానం కావాలని జగజ్జేగీయమానంగా
చకచ్చకితంగా వెలుగుతున్న అక్షరకాంతులు ఆశావహంగా
ఐకమత్యమొక్కటే  మన జాతికి అనంతమైన బలమని
 ప్రబలంగా తన హితోక్తిని వీనులవిందుగా  వినిపిస్తున్నది..
========================================
ఈకవిత నాస్వంతం దేనికీ అనుకరణగానీ అనువాదంగానీ
కాదని మరే ఇతర పత్రికలోనూ ప్రచురణకు పరిశీలనలోనూ
లేదని హామీ..

రావెల పురుషోత్తమ రావు
1651 BriarcliffDr
NolensvilleTN 37135[USA]
======================

చిరకాలం గుర్తుండేలా
నీకేం బహుమతినివ్వాలి?

వసంతాన విరబూసిన
గులాబీలతో సత్కరించనా?

గ్రీష్మమ్నాడు సాయంసమయంలో వీచే
మలయపవనాన్ని కానుకగా సమర్పించనా?

శిశిరంలో నేలకు రాలిపడే పండుటాకుల
గలగలారవాలను వరుమానంగా అందించనా?

ఒక రుతువుకే పరిమితమైన ఇవన్నీ నీకు
కలకాలం గుర్తుండే కానుకలెలా నిలబడతాయి?

ఆరుగాలాలపాటు అచ్యుతమై అలరించే నా
అనురాగానుబంధాల కౌగిలింత ఆకళింపునివ్వదా?
==================================

Monday, September 5, 2016

నాలుగు గోడలమధ్యన
నాజూకుగా భద్రపరుచబడి
ఘనీభవించి,శిలాజాలా
మూర్ధన్యమై మిగిలిపోయిన
జ్ఞాపకాల స్రవంతులన్నీ
పునరేకీకరణకోసం
ఉవ్విళ్ళూరుతూ,  రెంట్టింపయిన
ఉత్సాహంతో...

చతుష్చక్రపు వాహనాల్లో
భద్రంగా పయనిస్తూ
క్షేమంగా ఒక్కచోట చేరి
హృదయగత భావాలనన్నింటినీ
విస్తారంగా ప్రవహింపజేయాలని
ప్రణాళికలు రచించుకుని
ఒక్కుదుటన ముచ్చటపడుతున్న
ఒకచో ఒప్పులకుప్పలా ఒయ్యారి భామల్లా
కలుసుకున్న  శుభ తరుణాన
పర్వత సానువుల చెంత విస్తరించిన
తరూసమూహపు పచ్చని పట్టుచీరెల
రెపరెపలు వింటూ, పక్షులుసైతం
ఊపిరి బిగబట్టుకుని ఆ జ్ఞాపకాల
ప్రవాహాల్లో పెద్దతనాలను మరిచి
మాకఫ్ఫెదుటన పుట్టి పెరిగిన పిల్లలంతా
మరోతరానికి నాందీవచనంగాతల్లులై,తండ్రులై
మనసులన్నీ విప్పార్చుకుని మానసవీణలను
శృతిబద్ధంగా, లయాన్విత సౌందర్యంతో
బృందగానాలు పాడుకున్నవేళ

స్రవంతులన్నీ

సమధికోత్సాహం ముప్పిరిగొన్న
 శుభ సమయాన

సాంకేతికతను సరదాగా
బుల్లిపెట్టెల్లో,సర్దుకుని కూర్చోమని శాసిస్తూ
చిన్నపిల్లలను సైతం కేవలం ఆటపాటలకు
దగ్గరగా నడిపించుకుంటూ,



Tuesday, August 30, 2016

నన్నేమీ అడక్కండి!!!
-----------------------రావెల
***********************************
ఆనవసంబాధాలనుంచి
మనసు మరచుకున్నావెందుకని
 మాత్రం నన్నడక్కండి..
కొండలూ గుట్టలనూ ధ్వంసంచేసిపారేసి
ఇండ్లకు పునాదిరాళ్ళుగా పేర్చుకున్నారు..
హరితవనాలనన్నీ విధ్వంసం చేసి
రాజధానిని నిర్మిస్తున్నారు..
మట్టినేలను సైతం ఆకాశ హర్మ్యాలకోసం
మవ్శానంగామార్చి మృదుహాసాన్ని నటిస్తున్నారు..

 రహదారులన్నింటినీ రణరంగాల్లా
కాలుష్యకారకాలుగా మార్చేసి  శబ్దాలతో
 నిండిపోయేలా చేసి  ఎక్కడికయినా పారిపోదామనిపించేస్తున్నారు..
ఈ జనారణ్యాలు నివాసయోగ్యం కాదనిపించేస్తున్నారు..
ముక్కుమూసుకుని జపతపాలతో మునిగిపొవడడమే మేలనిపించేస్తున్నారు..
==================================================
నన్నేమీ అడక్కండి[2]
-----------------------రావెల
***********************************
నాముఖద్వారం అప్పిసెం
మూసే వుంటుందెందుకని మాత్రం
నన్ను ససేమిరాడగొద్దు!!
వసంతంవెల్లివిరిసిన నేలనంతటినీ
శిశిరరుతువులామార్చి ఆశలతోనిండిన
ఆకులన్నింటినీ క్రూరంగారాల్చేస్తున్నారు..
ఈ ప్రక్కన ప్రవహించే పిల్లకాలువ ఒడ్దునుసైతం
దుర్మార్గం దురాక్రమణజేసి ఇండ్లను నిర్మించుకుంటున్నారు..
పగటి చీకటితో అలమటిస్తున్న ప్రభుత్వాలకనులుగప్పి
అధికారుల తలలను అవినీతిలోముంచేసి
తమ పబ్బం గడుపుకుంటున్నారు..

ఉదయాన్నే దినపత్రికలన్నే నేర వార్తలతోనింపి
సున్నితమైన నా మనసును క్షగాత్రంగా మార్చేసి
కులుకులు నటించేస్తున్నారు..
మనిషిని కదిలిస్తే మానభంగాల
కధలే వినబడుతున్నాయి..
ఇంతకన్నా నాతలుపులు బిడాయించుకుని
కృష్ణా,రామాంటూ తత్వదర్శనాలతో
మునిగి తేలడమే మేలనిపించేస్తున్నారు..
========================================

నన్నేమీ అడక్కండి!![3]
=================రావెల

ప్రభాత సమయాన పాదచారిగా
కనిపించడంలేదని ఒక్క ప్రశ్నను
వేసి నన్ను మాత్రం విసిగించకండి..

ఇప్పటిదాకా నేను చేస్తూ వచ్చిన
 దేశ  సంచారాలు చాలు!
ఎక్కడ పర్యటించినా ఇక్కట్ల భారతమే
ఎదురవుతూ వస్తున్నది..

మనసు మనసులో స్థిరంగా నిలబడకుండా
చలన శీలగ మారి  వేధిస్తున్నది..

కోహినూరు వజ్రాన్ని తిరిగి మనదేశానికి
ఎందుకు తేవడంలేదని కోపం
ప్రకటించగలవాళ్ళెందరు?

పంచతంత్రంలోని నీతికధలను
నిత్యం గుర్తుచేసుకుని జీవిస్తున్నవారెమందరు?

శతక సాహిత్యంలో ప్రస్ఫుటించే
ప్రసన్నమౌ వాక్యాలను గుర్తుంచుకుని
జీవితగమనాన్ని మలుచుకుంటున్నవారెందరు?

ఈ తత్వహితమైన బోధనలను
ఎవరితోపంచుకునేవీలు కలగడంలేదు..
మౌనంగా నావరకు నేను ఇంటి నాలుగు
గోడలమధ్య గోప్యంగా గుట్తుగా ఉండడమే మేలని
నిశ్శబ్ద  సామ్రాజ్యంలో నివసించడమే మేలని
అనవరతం కాక్షిస్తున్నాను..
ప్రపంచదర్శనంలో ఆశించిన ప్రయోజనం
సిద్ధించడంలేదన్న యదార్ధాన్ని గ్రహించాను..
అందుకే నాయాత్రలన్నింటికీ విరామం ప్రకటించేస్తున్నాను..
===============================================



Monday, August 29, 2016

చీకటి  చైతన్య యాత్ర
---------------           రావెల
చీకటిగూడా ఇకనుంచి
చైతన్య యాత్రను 
చేపట్టబోతున్నానని
అన్ని మా మాధ్యమాలద్వారా
ఓ రంగురంగులప్రకటను 
విడుదలచేసింది.

చిక్కటి చీకటి 
తన నలుపురంగును
ఎప్పుడు ఎందుకు ఎలా మార్చేసుకుందో
నన్న ప్రశ్న అప్పటినుంచీనా
కుమ్మరి పురుగులా 
తొలిచేయడం మొదలెట్టింది.

రోజుకో కండువాకప్పుకుని
వీధులవెంట అదో విజయంగా
భావిస్తూ నిస్సిగ్గుగా
తిరగ గలుగుతున్న
ఛోటానో , బడానో ఐన నేతలా
ఊపిరిని బిగబట్టుకోవాల్సినంత
బిగ్గరగా నినాదాలను చేస్తూ
ఊరేగుతుండడంతో దీనికీ ఉత్సాహం
ఊపిరిలూదినట్లున్నది.
ఓదార్పుయాత్రలతో ఒకడు
వర్గాలవారీగా చైతన్య 
యాత్రలంటూ మరొకడూ స్వేఛ్చగా
తిర్గడంచూసి దీనికీ
 ధైర్యమొచ్చినట్టున్నది.
కులాలవారీగా జరుపుకుంటున్న
వనసమారాధనలు ఊతమిచ్చాయేమోమరి!!


మతాలవారీగా సమ్మతమౌతున్న
అసహానికి చెంపపెట్టుగా
 ఈ చైతన్య యాత్రలన్నీ
 దిగ్విజయం కావాలనీ
నిద్రాణమై చేవచచ్చిపోతున్న జాతి
హృదయపూర్వకంగాకోరుకోవడంలో 
విశేషమేముందని చీకటిని
తరిమికొట్టాలని భావించే వెలుగురేకలూ
విచ్చుకోవడం మానేసి నిస్త్రాణగా పడివుంటున్నాయ్!!
=======================================================
జీవనచిత్రాలు-6
=================
పల్లెటూర్లో పుట్టి పెరగడంవల్లనేమో
పుట్టిన తేదీలు జరుపుకునే ఆనవాయితీ
మా ఇంటా ఒంటా లేదని చెప్పుకోవడం రివాజుగావుండేది..


నేనందుకు భిన్నమైన వాతావరణంలో పెరిగిన వాడినికూడా
నాకుకూడా ఆ ఆనవాయితీ పరంపరంగా పాతికేళ్ళదాకా కొన సాగింది...పెళ్ళయాక తను నాజీవితంలో భాగస్వామ్యం పంచుకున్నాక పుట్టినరోజును జరుపుకోవడం మొదలయింది..
అది మొదట్లో కొంచం ఎబ్బెట్టుగా అనిపించినా తను చూపిన శేద్ధకు
మురిపెంగా ముఖ కవళికలు మారేవి..
ఉదయానేలేస్తూనే తలకు నూనెనంటి నొసటన పెద్దకుంకుమ బొట్టుపెట్టి
తల స్నానానికి తను స్వయంగా సహకరించేది..అలా పిల్లలు పెద్దవాళ్ళయేదాకా అలాసాగినా ఆ తర్వాత స్నానాలగదిలో ఒంటరిగానే తలంటుకోవడం ప్రారంభమయింది..నేనడిగితే ఒద్దంటున్నానని తనే ఒక కొత్తచొక్కా లాగు కొని తెచ్చి దేవుడిదగ్గర కొబ్బరికాయ కొట్టించి పాయసం తినిపించి వస్తధారణ చేసుకోమని
చిరునవ్వులతో సత్కరించేది..అలా పిల్లల పుట్టినరోజులకొచ్చేసరికి
కేకులా కాండిల్ లు ప్రవేశించాయి..తను ఎమ్మె బి ఈడి చేసిందిగనుక మొదటిదగ్గరనుంచీ ఏకవచన సంబోధనను ఇష్టపడే వాడినిగాదు..
బాగా కోపం నెత్తికెక్కితేమాత్రం ఏమ్మా రాణీ గారూ ఏమిటిది అని
కొంచం గద్దిస్తుండేవాడిని తనుమాత్రం చివరిదాకా ఏమిటి స్వామీ
అంత హంగామాచేసారు ఇంత చిన్నదానికేనాZ? అంటూ ఒక చిరుమందహాసంతో ఆకోపాన్ని కొండెక్కించేఏది..ఇప్పుడు తను కాలధర్మం చెందాకా ఆపుట్టినరోజు హంగామాలు పూర్తిగా కాదనుకున్నా ఆ పురా స్మృతులను మనోవల్మీకంలోంచి బయటకు లాగి
కనులను చెమరించుకోవడం తప్ప ఇంకేం చేయలేని అసమర్ధత నన్నంటి
పెట్టుకుని నయగారాలు పోతుంది..

తా//క...మావూర్లో ఒకబూబమ్మ వుండేది..చాలాసార్లు మాఇంటికి వచ్చి ఆ పుటకతేనె కాగితం ఇప్పించవా అని అమ్మా నాన్నలను బ్రతిమాలుతుండేది..అంత అమాయకత్వం విస్తరించిన మారుమూల పల్లె వాసులం..పుట్టిన తేది కాగితం కొచ్చిన తిప్పలవి.

Saturday, August 27, 2016

శతమానం భవతి....
======================================రావెల


మూడు పదులవయసులో ముచ్చటపడి మరీ
అరిషడ్వర్గాలు నన్ను ఆనందంగా బందీనిచేసి మురిపిస్తాయి


నాలుగుపదులు నవ్వుతూ నన్ను దాటివెళ్ళుతున్నప్పుడు
ఇకపై రోగాలబారిన బందీనికాకూడదని గట్టిగా విశ్వసిస్తాను..

యభయ్యో,అరవయ్యో పడుల్లోకి రాగానే గుండె గొప్పగా కొట్టుకోవడం విని
నన్ను నేనే అభినందనపరంపరలో ముంచెత్తుకుంటూ వుంటాను.



డెబ్భయోపడిలోకి చేరుకున్నాక అనారోగ్యలక్షణాలు
నాతో చెలిమి చేయాలని అనుక్షణం తహ తహ లాడుతాయి.

ఎనభయ్యోపడికి చేరుకోగానే దూరదూరతీరలచెంత
నినదించే మృత్యు ఘంటికలు నన్ను చేరుకుంటున్నసత్యాన్ని గ్రహిస్తాను..


తొంభయ్యోపడిలోకి తొటృ పడుతూ చేరువవగానే
నాలోని ఆత్మవిశ్వాసం నన్ను కొత్త మధువులను రుచిచూడమని ప్రేరే[పిస్తుంటాయి..

అన్ని దశల్లోనూ ఆ పరమాత్ముడే నన్ను నిరంతరం నడిపిస్తున్నాడని గ్రహించి
అతని పిలుపుకోసమే ఆశగా ఎదురుచూస్తూ సంకీర్తనలు వింటూ
శేష జీవితానికి ముగింపుగా  మంగళహారతులు పాడడంలో
మునిగితేలుతుంటాను..
===================================================

Friday, August 26, 2016

మనం మన మూలాలను మరచిపోయి పరాయిమతంవైపు
పరాజ్ఞ్ముఖతను ప్రదర్శించకుండా కన్నార్పకుండా
చూస్తున్న రోజుల్లో..ఒక రకంగా ఆటవిడుపుగా నిన్నటిరోజున
పండుగ వైభవాన్ని పంచుకోవడానికి నేనుంటున్న దేశంలో
ఒక ప్రదేశమ్నుంచి ఒక 2 గంటలు కారులో ఇద్దరు మితబృందమైన
దంపతులతోకలిసి,శ్వేతజాతీయులు నడుపుతున్న ఒక ఆశ్రమానికి
[కృష్ణుడికి తనువు,మనసులను అంకితంచేసిన ఒకచోటకు వెళ్ళిరావడంజరిగింది..ఇదేరాష్ట్రంలో మల్బెరీ అన్న వూరిలో
మురారి కీర్తన్ ఆశ్రంపేరిట నడుపబడుతున్న చోటుకు వెళ్ళడం జరిగింది..
దారిపొడవునా పల్లెలే సాక్షత్కరించడంతో ముగ్గురమ్ముగ్ధులయాము..

అక్కడకు చేరుకోగనే హృదయపూర్వకంగా నమస్కరిస్తూ చిరిఉనవ్వుతో
ఆశ్రమ పెద్ద[గాధి] స్వాగతం చెప్పడం జరిగింది.. ఒక నలుగురు యువకులు[శ్వేతజాతీయులే] అక్కదున్న దేవాలయ ప్రాగణాన్ని అలంకరించడంలొ నిమగ్నమయారు.కృఇష్న,కృఇష్ణ,అన్న నామస్మరణకే
వారు అంకితమైనట్లు కనిపించింది..బయటకెళ్ళి తిరీగి ఆలయ ప్రాగణం ప్రవేసించిన ప్రతిసారి దేవుడి విగ్రహాలముందు సాష్ఠాగపడుతూ ప్రవేసించడంగమనించాము..
మాకోరికమేరకు ప్రాంగణాన్ని మంగలతోరణాలతో అలంకరించే బాధ్యతను స్వీకరించడానికి వారు అనుమతివ్వడం జరిగింది..
మామిడాకులనుబోలిన ఇంకొంచం మందపాటి [          ]ఆకులతొ
ద్వారబంధాలు,కిటిఉకీలు తోరణాలు కట్టి అలంకరించడం, విగ్రహాలకు మాలలు గుచ్చడంలాంటికర్యక్రమాలకు సహకరించడంజరిగింది..

ఆశ్రంలో విశేషాలుకొన్ని..అక్కడ గోసమ్రక్షణకు ఒక గోశాలను నిరించుకోవడం,పూలమొక్కలు,కాయగూరలమొక్కలు పెంచడం,గోమయంతో
అగరు వత్తీలు తయారు చేయడం,ఆవు నెయ్యి గడ్డపెరుగుతోటి మద్జ్యాహ్న భోజనం బాల్యాన్ని గుర్తుచేసింది.అప్పుడె చిలికిన మజ్జిగలోంచి వెన్న పెరుగు,మీగడను రుచిచూసి ముగ్ధులమయాము..
ఆకూరగాయలౌ పూర్తిగా చిఒంపోస్ట్ ఎరువులతోనే పండించినవి కవడంతో,ఆరుచి అమృతతుల్యమనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..
కలిసి నడుద్దాం రా
--------------------------రావెల
-----------------------------------
ఇప్పటిదాకా
విసుగూ విరమమన్నదితెలియకుండా
తుమ్మ బంకలా అంటుకునిపోయి వదలను పొమ్మంటూ
భీష్మించుకు కూర్చున్న
వైవిధ్యపు వైమనస్యాలతో
వేదనచెందుతూ కూర్చుంటున్నాం..
మనిషులుగా భూమ్మీదకు రాలిపడిన
వాళ్ళమేగదా!!
మంచి మనసులతో ఎందుకు ఒకరితో మరొకరం
 చెలిమిబలిమిని తెలుసుకుని స్నేహం
చెయ్యలేకపోతున్నాం?
ప్రభాతాన విరగబూసి
పరిమళభరితమై సువాసనలు వెదజల్లే
సుమాలను చూసినేర్చుకుందాం!!
చలన శీలయై పరుతూ ప్రవహించే
 నదీ నదాల  ధృతిని గుర్తుతెచ్చుకుని
మనమార్గాన్ని సమున్నతంగా సవరించుకుందాం!

కక్షల కావేషాల బురఖాలను విసర్జించి
కౌగిలింతల ప్రస్థానంలోని కమ్మదనాన్ని విస్తరించుకుంటూ పోదాం!
చేతులోచేయివేసుకుని మనచుట్టూ ఇప్పటిదాకా
మనతీరును నిరసిస్తూ వచ్చిన తోటి సమాజం నివ్వెరపోయేలా
రా! నూతనంగా మనం నవనవోన్మేషంగా నిర్మించుకున్న
కొత్తదైన బాటలో ఉత్సాహాన్ని ఊపిరిగా మలచుకుని
ముందుకు మున్ముందుకు అడుగులువేస్తూ కలిసి నడుద్దాం రా!!
=======================================

Thursday, August 25, 2016


మరికొంత వయసు దాటాక------
-------------------------------రావెల
==========================================

పడమటికనుమల చాటుకు
పరుగెట్టుకెళుతున్న ప్రభాకరుని చూసి
అలా దిగులుపడుతూ దిగాలు చెందుతావేం?
వచ్చినచోటుకు వెళుతున్నాడని సంతసించలేమా?

బాల్యావస్థలో ప్రాధమిక విద్యాలయాల్లో
వరుసగా భట్టీయం పట్టిన శతక సాహిత్యాన్ని
పునశ్చరణచేసుకుంటూ వల్లెవేసుకుంటూ కూర్చుందాం..

ఉరకలెత్తే వయసులోఉత్ప్రేరకంగా చదువుకున్న
ప్రబంధాలలోని అష్థాదశవర్ణాలలొ అధికంగ ప్రేమించిన
శృంగారాన్ని రసగంగాధరులమై మరోసారి జుర్రుకుందాం ,రా!

నడివయసుకొచ్చేసరికి నడుంకూలదోసుకుని చెవులకు రింగుల్లా
తగిలించుకున్న శ్రవణ సాధనాలతో పరవశించిపోతూ
రామదాసు కీర్తనలతోనో,అన్నమయ్య సంకీర్తనలతోనో
హాయిగా వింటూ కాలాన్ని చెరుకురసంలామార్చుకుని సేవిద్దాం రా!!

వయసునొసలుపై ముసలిరేఖలు చిత్రించారని మొహం ముడుచుకుంటే ఎలా?
అన్నిదశలలోను అనుభవించిన జీవితాన్ని అసురసంధ్యవేళలో
ఆసాంతం నెమరువేసుకుంటూ,జీవిత ధ్యేయం ధన్యమయిందని
సుఖశాంతులతో సౌమనస్యంగా సౌశీల్య మనస్కులమై సాగిపోదాం రా!
=============================================

Wednesday, August 24, 2016

వయసు కొంత మరలాక---
----------------------------రావెల
************************************
నేనూ నీవూ ఒక పడికి చేరుకున్నాక
వయసుకు తగ్గ ముచ్చట్లతో మురుసుకుంటుంటాం!
కాళ్ళు పీకుతూ వుంటాయి,కళ్ళు వేటికోసమో
వెదుకుతూ విసిగివేసారుతూ వుంటాయి..

పగలంతా విసుగుగా వెసులుబాటును
 వాటేసుక్కూర్చుంటాం..
వయసు నొసలుపై గీసిన ముసలిరేఖలు
ఎక్కడ విదితమౌతాయేమోనని అద్దం ముందుకు
వెళ్ళడానికే అనుక్షణం జంకుతూ వుంటాము..

కనులు తొందరతొందరగా మూతబడుతుంటే
పడమటింటికి పయనమయే సూరుడి చిత్తగింపును
పనిమాలా  వీక్షిస్తూ కూర్చుంటాం..

అప్పుడప్పుడూ నడక దారిలో పాదచారులుగా
ప్రతి గతకాలపు మధుర స్మృతులనూ
నెమరువేసుకుంటూ మురిసిముక్కలయిపోతుంటాం..

ఎదురుగా వున్న కవితా సంపుటుల్లోని
 చిన్ని చిన్ని అక్షరాలను కలిపిచదువుకోవడానికి
నానా యాతన పడుతూ నవ్వులతో కాలక్షేపం చేస్తుంటాం..

బాల్య స్నేహితులెవరైనా కనబడితే ఆపురా స్మృతులను
పదే పదే హెచ్చరించుకుని మనలోమనమే నవ్వుకుంటుంటాం..

యువతరం ఎదురైతే ఎక్కడ తాతగారని సంబోధించి
మన అసలు వయసును గుర్తుకు తెస్తారేమోనని
ప్రక్కకు తప్పుకుని పారిపోతుంటాం..

ఇద్దరంకలిసి కాఫీతోనో తేనీరుతోనో మద్యపానంతోనో
మనవయసును మరిపించే జ్ఞాపకాల ప్రవాహాల్లో
మునిగితేలుతూ వయసును మరచి నవ్వులే నజరానాలుగా
నయగారాలొలకబోస్తూ నవనవోన్మేషంగా చివురులు తొడుగుతూంటాం.

[ఒక చైనీస్ కవితను చదివిన నేపధ్యంలో...]
మళ్ళీ ఒకసారినీతో మాట్లాడితే బాగుండునన్న తపన
ఏ పూలచెట్టును పలకరించినా నీతోనేమోనంటున్న పులకరింత..
గోరింటాకును పులుముకున్న చేతులను చూసినప్పుడల్లా
నీవే అందంగా దగ్గరుండి అలంకరించావేమోనన్న భావన..
ఎదురుగా నిలుచున్నా ఎదనిండిన దు:ఖంతో
మౌనాన్నాశ్రయిస్తానేమోనన్న భయం అనుక్షణం వెంటాడి
నన్ను నిరంతరం ఓడిస్తూ,తనే గెలిచానన్న గర్వంతో నిక్కుతుంది..
చిలిపి కృష్ణుడు గోలతో గెలిచితీరె
గోల కృష్ణుడు చిలిపిగా గెలుచుకొచ్చె
గోపికమ్మలు ప్రేమగా ముద్దలిడుచు
ముద్దుపెట్టగ బుగ్గలుగడ్డకట్టె..
===================
చిలిపి కృష్ణుని లీల చెప్పవే గోపికా
వెన్న ముద్ద తినుచు ముద్దులిడెన?
కొంగుబట్టిలాగి కోరికె లడిగెనా?
నిజము చెప్పవమ్మ నంగ నాచి !

Tuesday, August 23, 2016

స్వగతం
========
నా నొసటన తీర్చి దిద్దిన విభూదిరేకలు
నేను నమ్ముకున్న మతం నేర్పిన
 ధర్మంలోని తిలకధారణ
అన్నీ మూకుమ్మడిగా నన్ను అవమానాల
 పాల్జేయడానికే సిద్ధమయాయి...
నా కళ్ళల్లో ఎగసిపడుతున్న అమాయకత్వం
నా గుండెలోనుంచి పొంగిప్రవహించే
జ్ఞాన కిరణాల ధునులు  మాత్రం
ఎవ్వరి కంటా విశ్లేషణకు
 కూడా కనబడకపోవడం-
విచక్షణకు మాత్రమే గురికావడం
--ఎందుకోమరి?



Saturday, August 20, 2016

గుర్తొచ్చినప్పుడల్లా
గుండెను కలుక్కుమనిపించే
అనురాగ సింధువువు నీవు

గొంతుకలో పొలమారినప్పుడల్లా
నీ ప్రేమానురాగాల ప్రవాహమే
దాపుకొచ్చి ఆదుకుంటుంది..

మనిషి పోతె మాత్రమేమి
మమతానుబంధం గట్టిగా
పట్టుకుని వదలకపోతే చాలుగదా!!
===========================

Thursday, August 18, 2016

మనాదికి చేరువగా
-----------------------------రావెల..
శిశిర ఋతువులోని ఎత్తుగాలులన్నీ
బలంగా వీస్తూ కళ్ళను బైర్లుగమ్మిస్తున్నవి..
తెలిమబ్బులన్నీ క్రమ క్రమంగా గుంపులుగాచేరి
పచ్చికబయళోళనూ,నందన వనాలను మూకుమ్మడిగా
వట్టిపోయేలాచేసి వ్యధార్తులను గావిస్తున్నవి..

పిల్ల కాలువ వెంట వడి వడిగా పరుగెత్తాలనున్న
కాగితం పడవ అడుగుముందుకు వేసే మార్గం కనబడక

ఆపసోపాలుపడుతూ అనాధలా ఆక్రోశిస్తున్నది..
సమీపంలో కుదురుకున్న సముద్రం నీతి మట్టంపై

ఎగ శ్వాస దిగ శ్వాసలతో ఎగిరెగిరిపడుతున్నవి..

పడవనడుతున్న వాడుకూడా ఇవ్వాళెందుకో
విషాద గీతాలనాలపిస్తూ, విసుగునధికంచేస్తున్నాడు..

అనుక్షణం ఆవిడను గూర్చిన స్మృతులే
 మనోవల్మీకాన్నధివసించి ఊపిరిసలుపకుండా
ఉప్పెనలా ఎగసి ఎగసి పడుతున్నవి..
గడ్దకట్టిన హృదయం మాత్రం మౌనరాగాల నాలపిస్తూ
మరో మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసాగా
విశ్వసిస్తూ కాలం వెళ్ళదీస్తున్నది..
[ఒక చైనీస్ కవితను చదివిన నేపధ్యంలో---]

================================

Wednesday, August 17, 2016

విషాద మోహనం
-----------------------

ఆవిడ కట్టుకున్న పట్టుచీరె రెపరెపలు
ఇంకా నా చెవుల్లో రింగు రింగు మంటూనే ఉన్నాయ్
ఆవిడ నడిచిన పాలరాయి నేలంతా దుమ్మూ ధూళితో
నిండిపోయి అనునిత్యం అత్యంత  చిరాకు పుట్టిస్తున్నది..
ఆవిడ పడకగది అదేమిటో శీతలం కమ్మేసినట్లనిపిస్తున్నది..

శిశిరమంతా రాలిపడిన ఆకులు గాలికి కొట్టుకొచ్చి
ముఖద్వారమంతటినీ విపరీతంగా కప్పేసాయి..
వసంతం వచ్చినా ఆవిడ స్మృతుల్లోంచి తేరుకోలేని నేను
నగుమోముతో ఎలా మీకు దర్శనమివ్వగలను మీరే చెప్పండి..

[క్రీ పూ] --157-87 నాటి ..ఒకచైనీస్ కవితకు అనుసృజన]

శిశిరజ్యోత్స్న
*******************

ఆమె వెళ్ళగానే
గదినిండా సురభి ళ పరిమళం
నా నాసికాపుటాలను తాకి
నవనవోన్మేషమయింది
ఆమె చూపులు
నిశితంగా నావైపు సారిస్తే
నానిజాయితీ తొట్రుపడి
దృష్టి మరల్చడం తప్పనిసరయింది
మళ్ళీ ,మళ్ళీ
ఆమె యీగదికి పదేపదే రావాలని
తన చిరుదరహాసామృత ఝరులతో
నా హృదయకుహరాలనుస్యూతంగా
పరిషేచనం చేయాలని
పడేపదే మనసు అభ్యర్ధిస్తున్నది.
అభిలసిస్తున్నదికూడా

ఎదో ఒక ఎడతెగని ఆలోచన
గుండె గొంతుకలో తారట్లాడుతూ
ఆశాఉషస్సులచెంతకు
ఆబగాపరుగెట్టిస్తున్నది

ఆమె పునరాగమనంకోసం
అంకితభావంతో ఎదురుచూస్తున్నది మనసు
ఆ మధురతరమైన ప్రణయానురాగతరంగాలు
ఈ వలపు మహోదధిని అలరిస్తాయని
ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. .
==================================
ఆమూలాగ్రంగా ----
===============

వేసవికాలమంతటా
వేడిమి పొగలు సెగలు కమ్ముతూ
వాతావరణాన్నంతటినీ
ప్రచండభానుని ప్రోత్సాహంతో
చెమటలు పట్టిస్తున్న వేళ ...

అతడొక్కడూ నింపాదిగా
ఒక పుస్తకాన్నిముందేసుకుని
ఆరోజు సాయంత్రమ్నుండీ 
అర్ధరాత్రి అడుగులో అడుగువేసుకుంటూ
 అరుదెంచేవేళదాకా
పుస్తకాన్ని ఆసాంతం నమిలేసే పురుగులా
దీపపు కాంతిలో ధగద్ధగాయమానంగా
దేదీప్యంగా వెలుగువిరజిమ్ముకుంటూ తనప్రపంచంలోతనే
ఒక మహారాజులా నిద్రను జయించిమరీ వెలుగులీనుతున్నాడు..


 బయట పరిసరాలన్నీ ఉరుములూ మెరుపుల నిట్టూర్పులతో
ఉద్రిక్తమై ఉస్సురుస్సరునుకుంటూ ఆపసోపాలు పడుతున్నది..
అయినా అతడు ఆకావ్యపరీమళాలను ఆస్వాదించే పనిలో
మునకలువేస్తూతేలిపోతూ వుంటే
నిశ్శబ్దంకూడా రాజ్యమేలడం మానేసి
 నిద్రకుక్రమిస్తున్న ధోరణి విశదమౌతున్నది..

అతడుమాత్రం తన ఏకాగ్రతకు భంగం వాటిల్లకుండా
మేజాబల్లమీదకు ఒరిగిపోతూ కావ్యపఠనం కొనసాగిస్తున్నాడు.

మెరిసిపోతూ అతడిని మురిపిస్తున్న కొన్నిపంక్తులు అతని మస్తిష్కంలో
చోటుకోసం క్రిందామీదాపడుతూ అన్వేషణలో చిత్తాన్ని కేంద్రీకరిస్తున్నవి..
ఆమూలాగ్రంగా ఆపుస్తకాన్ని ఔపోసనపడుతూ అతను
 ఆనందంగా రంకెలువేస్తున్నధోరణిలో అమృతోపమైన ఆసక్తితో
తనపఠనాసక్తిని కొనసాగిస్తున్నాడు..

బయట బాహిరకంగా ఎంతగా గడబిడలతో
వాతావరణం అతలాకుతలమౌతున్నా పుస్తకంలోని
 పంక్తులమీదనుండి అతడి దృష్టిమాత్రం మరల్చలేకపోతున్నది..

అతనికన్నా అదృష్టవంతుడిని ఎంపికచేయడం ఎంతకష్టతరమైనపనో
అందరికీ అవగతమౌతున్నది..

అందుకే అతడిని ఆశ్రయించి అంతటా అమృతమే
అనియతంగా  వర్షిస్తున్నట్లుగా గోచరమవుతున్నది..
--------------------------------------------------------------
రావెల పురుషోత్తమ రావు
1651 Briarcliff Dr
nolensvilleTn 37135
------------------------------------------

Tuesday, August 16, 2016

పుట్టిన ప్రధమ సంతానం అల్లారు ముద్దుగా పెరుగుతూ
ఏకసంథాగ్రాహిగా అందరిమనసులను దోచుకుంటున్నవేళ
చిన్న జ్వరం వచ్చినప్పుడు ఆపల్లెటూరులో వున్న డాక్టర్ల
దగ్గరకెళితే-- రెండుసార్లు మత్తుమందునెక్కించడం వలన
అనంతలోకాలకు తరలివెళ్ళిన నేపధ్యంలో
తను యం.యే[చరిత్ర] చేసివుండడంతో తనకు యేదయిన
ఉపాధినికల్పిస్తే ఆదు:ఖ సముద్రంలోంచి త్వరితగతిన
బయటపడుతుందిలెమ్మని అతికష్టం మీద భ్,యీడి సీటును
సంపాదించి చెప్పించడం జరిగింది..అప్పుడే పుట్టిన చిన్నబబుతో
ఇంట్లో సాకవలసిన వృద్ధురాలితో పనులన్నీ నిభాయించుకుంటూ
చక్కగా ఆకోర్సును పూర్తిచేయడం..నేరుగా ఒక విద్యాలయానికి
ప్రధనోపాధ్యాయురాలిగా వుంటూ అంచలంచలుగా ఎదిగినా ఎంతో
అణకువకు మారు పేరుగా జీవితగమనాన్ని మలుచుకోవడం ఒక విశేషం..
మధుసేవ
------------------రావెల
*******************************

నల్లటి మేఘాల గుంపులన్నీ
ధరణీతలాన్ని చీకటి
గుయ్యారంలా మార్చివేస్తున్నప్పుడు

వసంతాన్ని వాకిలి చెంతకు
చేరుకోకుండానే కొందరు విఫల మనోరధులు
ఆటంకపరుస్తూ ఆత్మ తృప్తినందుతున్నారు..

పాతరలోంచి పైకుబికి వస్తున్న గతకాలపు
జ్ఞాపకాలనన్నింటినీ విజృంభించి విస్తరించకుండా
తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకోవడంలొ అలక్ష్యంకూడదుసుమా!!


దిగులు చీకట్లు మనో వైశాల్యాన్ని
ఆక్రమించుకుని దు ఖభాజనం
చేయాలని తీర్మానించుకుని
అలజడులను సృష్టించకముందే
మనముందున్న మధువును సేవిస్తూ
మధుపాత్రలను ఖాళీచేస్తూ
 పానశాలను పునీతంచేద్దాం---

[ఒక చైనీస్ కవితకు స్వేఛ్ఛానువాదం]





Monday, August 15, 2016

గాలి ఈలవేసిన శబ్దం
మేఘం ప్రేమగా ఆశీస్సుల
నందించిన తరుణం
వెదురుపొదలోంచి పుట్టుకొచ్చిన
కర్రపుల్లలోంచి వెలువడిన
నాదక్రియద్వారా నినదించిన
సంగీతం సుమగీతమై
వెల్లి విరిసిన మధుర క్షణం
వీనులవిందుకు అర్ధం
 విశదమైన  వేణు గానపు విజ్ఞానం
అక్షరాలా మధురాతి మధురం.......

పెదవులనంటిన తేనె , బిందువుల్లా
జారిపడుతున్నదా !! అన్నట్లు ఆశగా
ఎదురుచూసిన అందమైన బృందగానలోలునిగన
డెందమంత ఆనంద సంధాయకమై ఉప్పొంగకుండునా?
రసధునిలో ఓలలాడక మిన్నకుండునా!!

Friday, August 12, 2016

నిన్ననీ శిరోజాల కుదురులోంచి
కసిగా జారిపడిన మల్లెపూవులా
నీ పద ఘట్టనలక్రింద జాలిగా
నలిగిపోవాలన్న భావన నాకులేదు.

నీ మందస్మిత నయనారవిందం లోంచి.
రాలిపడిన ముత్యపు గవ్వలా
శకలమై చిక్కి శల్యమౌ తున్న
రీతిలోనేను కృశించిపోవాలన్న
ధ్యాస యేమాత్రం నాకు లేదు

నీ మధురమైన మాటలతో
మౌనాన్నాశ్రయించిన క లల బరువుతో
న లుగుతున్న కాల ఘంటి కలా
కన్నీటి కడలిలో మునిగితేలాలన్న మురిపెం నాకస్సలులేదు.

నీవు ఉస్సురుస్సురనుకుంటూ తిట్టుకుంటూ
దీవిస్తున్న రీతిలో అభినయిస్తూ చేయించిన
స్వర్ణాభరణాలతో నీ కట్టెదుట సౌందర్య లలామగా
నా అందచందాలను ప్రదర్శించాలన్న ప్రగాఢ విశ్వాసం
ససేమిరా !! నా దేహంలోని యే అణువులోనూ
ప్రకటితమవదని తెలుసుకో--
=======================================

.

Thursday, August 11, 2016

ప్రభాత గీతం
-------------------------

వాతావరణం బాగాచల్లబడింది
దారంతా పొగమంచుతో దట్టంగా
కమ్ముకుని పోయింది...
చిరుజల్లుల వాన కూడా తుంపరలను
రాల్చడం ఆపివేసింది..
వసంతం వర్ణ సముచ్చయంగా
వొడలు విరుచుకుంటున్నది..
గెంతుతున్న చేపపిల్లలతో
కొలనంతా సందడితో నిండిపోయింది..

పూలన్నీ పరాగ ధూళులతో
ముఖాలను అందంగా అద్దుకుంటున్నాయి
కొండచరియలమీద  పచ్చికబయలు
కంఠ దఘ్నంగా పెరిగిపోయింది..
వెదురుతోటమాత్రం ఆకాశాన్ని ముద్దిడుకోవాలనీ
ముగ్ధమనోహరంగా మోజుపడుతున్నది..
పవన దుందుభులు తమ సయ్యాటలను క్రమేపీ
తగ్గించుకోవాలని తహతహ పడుతున్నవి..
ప్రభాత  సుందరికి శుభస్వాగతం పలకాలని
ప్రకృతియావత్తూ సర్వసన్నద్ధమై ఎదురుచూస్తున్నది..
[ LipO[701-762] చైనీస్ కవిత ఆధారంగా]





దుభాషీ
---------------

ఎగురుతున్న తూనీగలు
ఎవ్వరి ప్రతినిధులో
గుర్తుపట్టగలిగావా?
వాన చినుకులకోసం
అర్రులు చాచి ఎదురుచూసే
రైతన్నలకు హితైషులు..

వరుణుని దగ్గరకు నేరుగా
వారి హృదయగత వేదనను
అనావృష్టి వలన జరిగే
అనర్ధాలను సవివరంగా
అందజేసే వార్తాహరులు
దుశ్శాలువాలు కప్పుకున్న
దుభాషీలని తెలుసుకో!!
=======================
డక్షిణాదిన ఓ మారుమూలనున్న ఆపల్లెలో
నా శేషజీవితం గడపాలన్న చిరకాలవాంఛ
ఇన్నాళ్ళకిలా నెరవేరినందుకెంతో సంతోషంగా వుంది..
మనసున్న మనుషులక్కడ పుష్కలంగా వుంటారని ప్రతీతి..

నేనుండే ఇల్లు అస్సలు పెద్దదేంకాదుసుమా!!
ఒక మమచం, ఒక చాపా చాలుగదా ఈ వయసులో నాకు..
ఇరుగుపొరుగువారప్పుడప్పుడూ వచ్చి మనసారా పలుకరించే
వీలంటూ వుంటే చాలుగదా ఇంకా అంతకన్నా సౌహార్దం ఏంకావాలి?

పాతజ్ఞాపకాలు నెమరేసుకుంటూ నాతో పంచుకోగలిగిన అనుభవజ్ఞులైన
స్నేహితులుంటే చాలుగదా ఇంకేం కావాలినాకు చెప్పండి..
ప్రాచీన కావ్యాలను పునశ్చరణ చేసుకోకోగలిగిన
తీరికుంటే చాలునాకు..అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది నాకు నిజంగా!!

క్లిష్టమైన పద సంచయం ఎదురయితే అన్వయాన్నందించగలిగిన
స్నేహితులుండడంకన్నా ఇంకేం కావాలి? మనసును ఆరోగ్యకరంగ

ఉంచుకోవడం అప్పుడొక లెక్కంటారా విజ్ఞులు మీరే చెప్పండి!!
[ఒక చైనీస్ కవితకు[క్రీ శ. 372-427 ప్రాంతం] స్వేఛ్చానువాదం]
==============================================

Wednesday, August 10, 2016

విదేశీ పద్యాలు---1
-------------------------------
అవధాన ప్రక్రియలో విదేశాల్లో నివసించే
ఆడువారు బహు నిష్ణాతులు
ఇంకా ఉద్యోగంలో మునిగితేలేవారయితే
ద్విగుణితంగా పృఛ్చకులుగ నరిస్తుంటారు..

Friday, July 29, 2016

సారాంశం
-------------------రావెల
================================

ఒక సారి అటువైపు
చూపును సారిస్తే
కనుచూపుమేర
ఎడారియే ఎదురుగా
నిలిచి ఎక్కుపెట్టి
రోదిస్తున్నట్లనిపిస్తున్నది
ఆ దృష్టినే ఒక్కుదుటున
ఇటువైపుకు మరల్చగానే
ఆకులన్నీ చెట్లపైనుండి
దివ్యదృష్టితో ప్రజానీకాన్ని
మనసారా దీవిస్తున్న అనుభూతి..

తరువు మనపరువును నిలుపుతుందని
అర్ధమైపోయింది ఇక హరిత హారాన్ని
ప్రకృతిమాతకు కానుకగా అలంకరించడానికి
అనూహ్యంగానే అడుగులు మున్ముందుకు
పడుతుoడడమే నిజమైన సంపత్తి..
=================================

Thursday, July 28, 2016

తరుహాసం
---------------రావెల


వసంతం వస్తుందనగానే
వయసుడిగిన తరువుకూడ
తరుణాంకుర  ప్రభలతో
చివురులువేయనుంకిస్తుంది..
శిశిరం వైపు తలత్రిప్పి
చిరు హాసం చేస్తుంది..
చినుకులక్రింద స్నానంచేస్తూ
నిత్య శోభతొ అలరిస్తుంది..
శరత్ హేమంతాలకు
చలిదుప్పటి కప్పుతుంది..
ప్రకృతిమాత ఒడిలో
ప్రశమిస్తూ మురుస్తుంది..
======================

Wednesday, July 27, 2016

వేసవికాలమంతటా
వేడిమి పొగలు సెగలు కమ్ముతూ
వాతావరణాన్నంతటినీ
ప్రచండభానుని ప్రోత్సాహంతో
చెమటలు పట్టిస్తున్న వేళ ...

అతడొక్కడూ నింపాదిగా

ఒక పుస్తకాన్నిముందేసుకుని
ఆరోజు సాయంత్రమ్నుండీ అర్ధరాత్రి
అడుగులో అడుగువేసుకుంటూ అరుదెంచేవేళదాకా
పుస్తకాన్ని ఆసాంతం నమిలేసే పురుగులా
దీపపు కాంతిలో ధగద్ధగాయమానంగా
దేదీప్యంగా వెలుగువిరజిమ్ముకుంటూ తనప్రపంచంలోతనే
ఒక మహారాజులా నిద్రను జయించిమరీ వెలుగులీనుతున్నాడు..


 బయట పరిసరాలన్నీ ఉరుములూ మెరుపుల నిట్టూర్పులతో
ఉద్రిక్తమై ఉస్సురుస్సరునుకుంటూ ఆపసోపాలు పడుతున్నది..
అయినా అతడు ఆకావ్యపరీమళాలను ఆస్వాదించే పనిలో
మునకలువేస్తూతేలిపోతూ వుంటే
నిశ్శబ్దంకూడా రాజ్యమేలడం మానేసి
 నిద్రకుక్రమిస్తున్న ధోరణి విశదమౌతున్నది..

అతడుమాత్రం తన ఏకాగ్రతకు భంగం వాటిల్లకుండా
మేజాబల్లమీదకు ఒరిగిపోతూ కావ్యపఠనం కొనసాగిస్తున్నాడు.

మెరిసిపోతూ అతడిని మురిపిస్తున్న కొన్నిపంక్తులు అతని మస్తిష్కంలో
చోటుకోసం క్రిందామీదాపడుతూ అన్వేషణలో చిత్తాన్ని కేంద్రీకరిస్తున్నవి..
ఆమూలాగ్రంగా ఆపుస్తకాన్ని ఔపోసనపడుతూ అతను
 ఆనందంగా రంకెలువేస్తున్నధోరణిలో అమృతోపమైన ఆసక్తితో
తనపఠనాసక్తిని కొనసాగిస్తున్నాడు..

బయట బాహిరకంగా ఎంతగా గడబిడలతో
వాతావరణం అతలాకుతలమౌతున్నా పుస్తకంలోని
 పంక్తులమీదనుండి అతడి దృష్టిమాత్రం మరల్చలేకపోతున్నది..

అతనికన్నా అదృష్టవంతుడిని ఎంపికచేయడం ఎంతకష్టతరమైనపనో
అందరికీ అవగతమౌతున్నది..

అందుకే అతడిని ఆశ్రయించి అంతటా అమృతమే
అనియతంగా  వర్షిస్తున్నట్లుగా గోచరమవుతున్నది..

Monday, July 25, 2016


హితోక్తి
=======

అక్షరం ప్రవహిస్తున్నవేళ అంతటా
ఆనందం తాండవనృత్యం గావిస్తున్నది..
సుమసౌరభమౌ సుందరపరీమళాలు
సువిశాలంగా విస్తరిస్తూ ప్రభవిస్తున్నవి.



అమ్మ, ఆవులతో మొదలైన వర్ణసముదాయం
మాతృ స్థానానికి మనసారా నమస్కరిస్తున్నది..
కమ్మనైన సంస్కృతీసంప్రదాయాల
వారసత్వాన్ని కనులవిందుగా వినిపిస్తున్నది..
వినమ్రంగా విశదీకరిస్తున్నది..

ఉడుతలు చెట్లకొమ్మలపై ఊయలలూగుతూ పలురకాల
కాయలను కొరికి కొరికి తమౌఉచ్చిష్టమే జగత్సర్వమని ఉపదేశిస్తున్నది..
ఏలుకనెక్కిన దైవానికి ప్రతి శుభకార్యంలోనూ
అగ్రసనాధిపత్యం వహించే అదృష్టానికి నోచుకుని
ప్రధమ తాంబూలాన్నందుకుని తనివితీరా మనలకు
ఆశీర్వాదాల నందిస్తున్నది..
ఏనుగునెక్కిన కవివరులంతా ఇక్కడి సాహితీలోకంలో
ప్రాత:స్మరణీయులై కంఠోపాఠంగా తమ పద్యాలను వల్లెవేసుకునే
అదృష్టానికి మనమoతా నోచుకునేలాచేస్తున్నారు..


ఒకాడొక్కడిగానే ఉంటూ ఓటికుండల్లా మారకూడదని
 పెద్దలమాటలనుఔదల దాల్చి ఉద్వాహప్రక్రియతో ఉత్సాహాన్ని
 తనివితీరా తమలోనింపుకుంటూ
తమ పరిసరాలకు కూడా దానిని వ్యాప్తి చెందించమని
 చెప్పకయే చెప్పుతున్నది..

అమ్మా, నాన్నా ,పిన్నీ , బాబాయ్ అక్కా,బావా , మామా, అత్తా
అని పిలుచుకుంటూ మన ఆత్మీయనురాగాల అనుబంధాలను
అనుభూతిప్రధానంగా మలచుకుందాం!


అంత: కరణను అనునిత్యం ప్రక్షాళనగావించుకుంటూ
ఆదర్శప్రాయంగా జీవితాలను క్రమానుబద్ధంగా మలచుకొమ్మని
సుఖశాంతులతో ప్రవర్ధమానం కావాలని జగజ్జేగీయమానంగా
చకచ్చకితంగా వెలుగుతున్న అక్షరకాంతులు ఆశావహంగా
ఐకమత్యమొక్కటే  మన జాతికి అనంతమైన బలమని
 ప్రబలంగా తన హితోక్తిని వీనులవిందుగా  వినిపిస్తున్నది..
========================================
ఈకవిత నాస్వంతం దేనికీ అనుకరణగానీ అనువాదంగానీ
కాదని మరే ఇతర పత్రికలోనూ ప్రచురణకు పరిశీలనలోనూ
లేదని హామీ..

రావెల పురుషోత్తమ రావు
1651 BriarcliffDr
NolensvilleTN 37135[USA]
======================

Sunday, July 24, 2016

భారతీయం-14
===================

మెరిసేలోహమంతా
బంగారంకాలేదు..
నాయకుడైన ప్రతివాడూ
నమ్మదగినవాడుకాబోడు..
---------------------------------
భారతీయం-15
------------
మిణుకుమనే తారగా
ప్రభవించువాడు
కవిగా వెలుగొందలేడు
తనజాతికి చేయందించలేనివాడు
నేతగ రాణించబోడు..
-----------------------
భారతీయం-16
--------------------
రాచపుండులాంటిదయ్య
రాజకీయ వ్యవస్థ
పట్టుకునేందుకు దొరకని
ఈగవ్రాలు  వ్రణమేగద
ఈ  పదవీ వ్యామోహం..
-----------------------------
భారతీయం
-----------------
ప్రతినిముషం
విషవాయువులను
వెదజల్లే
రాజకీయం
భారతీయ జగతికీ
బహుశా బహు  స్వంతం..
------------------------------------------------

Saturday, July 23, 2016

స్నిగ్ధ సౌందర్యం-4
------------------------
బురదలోన బ్రదికే కు
మ్మరి పురుగుల లేవనెత్తి
బంభరాలుగామార్చే
బ్రహ్మత్వం కవిలోవుంది..
----------సి.నా.రె--------
======================
స్నిగ్ధ సౌకుమార్యం-6
-------------------------
తుహినాచల శిరం నుండి
తురగలించే జలపాతాలు
కవిగుండెలో విద్యుత్తును
కల్పించక మానవు..
-----సి.నా.రె---------
==============
స్నిగ్ధసుకుమారం-7
------------------------
చెదలుతిన్న హృదయంతో
మసిబట్టిన మనస్సుతో
మాటలుగిల్కేవాడే
నాటికి కవిగాబోడు
-----సి.నా.రె-------
స్నిగ్ధ సౌకుమార్యం-8
=========================
కవిని మాత్రం సూర్యునితో
ఖచ్చితంగా పోల్చవచ్చు
ఏడువన్నెలు జీర్ణించుకుని
ఏక వర్ణం చిమ్ముతాడు
-----------సి.నా.రె------
స్నిగ్ధ సౌకుమార్యం-9
----------------------------
పుచ్చపూలు గచ్చపొదలు
జిల్లేడులు పల్లేరులు
కవికలం సోకితేనె
కల్పవృక్షాలవుతాయి..

---------సి.నా.రె......

స్నిగ్ధ సౌకుమార్యం-12
=======================

మందారంవలె నవ్వే
సుందర హృదయునికోసం
మల్లికవలె మాట్లాడే
మానవ మిత్రునికోసం
గడచిన కొన్నాళ్ళనుంచి
గవేషిస్తున్నాడీకవి
--------సి.నా.రె......

స్నిగ్ధ కవితాసారధి జ్ఞానపీఠ పురస్కారగ్రహీత
డా// సి.నారాయనరెడ్డిగారికి జన్మ దిన శుభాకాంక్షలు...

Friday, July 22, 2016

1970 లో నేను యం.ఎ తెలుగు స్నాతకోత్తర విద్యాకేంద్రంలో చదువుతుండగా దాశరధి గారు మా కేంద్రాన్ని సందర్శించడం
ఒక చిన్ని సభను ఏర్పాటు చేయడం జరిగింది..అప్పటిదాకా
ప్రాచీన సాహిత్యాధ్యయనం వైపే మొగ్గుచూపుతున్న ప్రధానాచార్యులవారికి వీరికి స్వాగతవచనాలు పలకడానికి
వెతకగా వెతగ్గా, అప్పటికే ఆదివారం సాహిత్యానుబంధాలలో
సాహితీ పరమైన వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురింపజేస్తూ,
ఆధునిక కవులపై వరుసగా ప్రజామత[అప్పుడు బెంగలూరునుండి]
వెలువడుతున్న వారపత్రికలో ప్రచురితమౌతున్న నన్ను ఎంపికచేయక తప్పలేదు..
ఇప్పుడు కవులుగా పేరుతెచ్చుకుంటున్న యువకవుల బృందం
[సుగం బాబు,దేవీప్రియ,కిరణ్కుమార్,కమలాకాంత్ తదిత్రులు కూడా
దాశరధితోపాటు వచ్చిన జ్ఞాపకం..
'దమననీతినెదిరించిన దాశరధి కవితాశీర్షిక పేరిత వారిని
పరిచయంచేయడం అగ్నిధారలను ప్రవహింపజేసి రుద్రవీణను మీటి
ప్రజాబాహుళ్యంలో ఒక చైతన్యమై నిలిచిన ఈ కవితాశరధి
ఇంతితై వటుడింతయై అన్నరీతిలో ఎదగడం మన అదృష్టమే నని నొక్కివక్కాణించగా సభాసదులలో ఆనందాతిరేకంతో కరతాళ ధ్వనులు మిన్నుదాకా ఎగరడం ఒక మధురానుభూతి.. కుర్చీలో అద్గీనుడైన డాశరధి ఒక్కుదుటున లేచి ప్రేమపురస్సరంగా ఆలింగనం చేసుకోవడం మరపురాని అనుభూతి..

ఆతర్వాత మాలతి అన్న లిఖిత మాసపత్రికను పలనాటి సీమలో[గురజాలలో] ఒక కార్డుముక్కరాయగానే స్వగతిస్తూ ఒక
స్వాగతగీతం రాసిపంపడం ఒక అదృష్టం.
మాలతి లతగా
సాహితి సుధగా
మధుర రచనలే
మానవకధగా
విలసిల్లాలని వెలుగొందాలని
అభిలషిస్తూ మీ దాశరధి..
ఆతర్వాత సంచిక వెలువడిన తరువాత పంపగా హృదయపూర్వకంగా అభినందించిన తీరు హృద్యమై శోభిల్లినది..ఆతర్వాత తెలుగు శఖ
ప్రాచార్యుల మనసులో ఒక సదభిప్రాయంకలిగి ఉన్నతంగా గౌరవాన్నందుకోవడం ఒక కొసమెరుపు
[దాశరధి గారి జన్మదిన సందర్భంగా ఒక స్మృతికోణం..ఆయన సహృదయానికి జోతులు..
ప్రారంభించిన సందర్భంలో
అక్షర సేద్యంచేసేవారికి
ఆ స్వీయ  అనుభూతే అజరామరం..
అమ్మను ఆవునూ ఒకచోటన
దర్శింపజేయగల దయామయి వర్ణమాల
ఈ వర్ణమాల..అసలుసిసలు రూపం .
 ఇంటినిచూడగానే ఈలవేసే సంస్కృతి
ఎక్కడికెళ్ళినా,  ఏదేశమేగినా
 పొగడ్తలతో పొంగిపోవు మాతృ  వందనం ..
పట్టుకుంటె కందునట్టి పట్టుగుమ్మ అక్షరం..

Thursday, July 21, 2016

అక్షర సేద్యంచేసేవారికి
ఆ స్వీయ  అనుభూతే అజరామరం..
అమ్మను ఆవునూ ఒకచోటన
దర్శింపజేయగల దయామయి
ఈ వర్ణమాల..అసలుసిసలు రూపం .
 ఇంటినిచూడగానే ఈలవేసే సంస్కృతి
ఎక్కడికెళ్ళినా,  ఏదేశమేగినా
 పొగడ్తలతో పొంగిపోవు మాతృ  వందనం ..

మాటలు సరిగ్గా పల్కడంలేదన్న మాటే గాని
మనసులనన్నీ ఇట్టే దోచేస్తుంది,,
చిన్ని చిన్ని సినిమా పాటలకు కనుల పండువుగా
తనే నృత్యం చేసి మురిపిస్తుంటుంది..


తాతా అని పిలవడంలోనే
 తన్మయత్వాన్ని రంగరిస్తుంది..
కోపంవస్తేమాత్రం కళ్ళలో
రౌద్రం కురిపిస్తుంది..
అక్కంటే తనకు ప్రాణమని
అందరికీ వివరిస్తుంది..
ఇద్దరంకలిసి పాటలు
పాడదాం రమ్మని వేదికపైకి
ఆహ్వానిస్తుంది..
వచ్చీ రాని సంగీతానికి
కనుకొలకుల్లో భావం చిందిస్తుంది..
తప్పని చెప్పగానే ఆహార్యం మార్చేస్తుంది..
అందమైన అందరి  హృదయమందిరాలకూ
తనే 'బాసు  'నంటూ ప్రల్లదాలు పలుకుతుంది..
ఇదేంగొప్పా? అనగానే పకపక నవ్వేస్తుంది..
================================

Tuesday, July 19, 2016

అందమైన చందమామ
అదృశ్యమార్గం పట్టేస్తే
దినం తెల్లవారనుపొమ్మంటూ
దిగాలు ముఖంతో కూర్చుంటుంది..

మధు చంద్రికలకు సిద్ధమయిన
వధువు గొంతు మూగబోతుంది..
కరగ్రహణంచేసిన వరుడు
నివ్వెరబోతుంటాడు..

వెండిగిన్నెలోనో,మట్టిపిడతలోనో
కలిపినబువ్వ తిననని
శిశువు భీష్మించుకుంటాడు..
మారుదారితెలీని తల్లిమనసు
మరుక్షణమే తల్లడిల్లుతుంది..

తారలకీ విలంబనమే తనువును
తహతహలతో ఉడికిస్తుంటుంది..
ఆకాశం నివ్వెరబోయి
ఆర్తనాదం లంకించుకుంటుంది..

హిమాచలమొక్కసారి
 వేడెక్కిన ఊహనాకు
సహారాఎడారి కన్నీటిసంద్రమై
పొంగి  పొరలినట్లు

వద్దమ్మా! వద్దుతల్లీ
వగపు బాధసైపలేను
తలక్రిందులుగ ఈజగతిని
దర్శించగ నోపలేను..
వలపుతేరుపై ఊరేగే
కలలతోనె తృప్తి మాకు..
=========================


Sunday, July 17, 2016

వెలుగు గానాలకెప్పుడు వెలితిరాదు..
మధుర మధురాతిమధురమౌ మనసు వెంట
హృదయమంతయు జలధియై ఉత్కళించు
చిత్రకారుని భావనల్ చిత్తగింప..
------------------------------------
కాంతిగీతాలు రచియించు కవులు గలరు
వెలుగు దీపాలు వెలిగింప వెలితి గనము
చిత్రకారునికుంచెలో చిత్తగించు
అందచందాలువడిగట్టు, వలపు ధనము

Saturday, July 16, 2016

నేను నీకోసం ఎదురుచూసినప్పుడల్లా
నిశ్శబ్దాన్ని నెమరువేస్తుంటాను..
నిద్రకుపక్రమించని రాత్రులన్నింటా
నిన్ను గూర్చిన జ్ఞాపకాలనే ఒక మూసలో
కలబోసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాను..

నీమాటలను ఎగర్తించవలసి వచ్చినప్పుడల్లా
అంతరంగ మధనంతో కుమిలిపోతుంటాను..
నీ ఊసులో నీ ధ్యాసలోనే శేష జీవితపు
మధురిమలను గుదిగుచ్చుకుని శ్వాసిస్తుంటాను..
===================================

Friday, July 15, 2016

త్రికాలజ్ఞత
-----------------

గతాన్ని గాలిస్తూ పోతుంటే
భావికాలం అధాటుగా ఎదురొచ్చింది..
యేంచేస్తున్నావని అడిగితే నెమ్మదయిన స్వరంతో
నాచేతిలోంచి జారిపడిన వర్తమానాన్ని
దొరకబుచ్చుకునే ప్రయత్నంలో నిమగ్నమయాను
అని చిరునవ్వును నావైపు విసిరి
చిరాగ్గా నిష్క్రమించింది..
=============================
రoగులీనేరసరాజ్యంలోకి
-----------------------------------

నీవును ప్రేమను అడుగడుగునారంగరించి
రంగవల్లిలాగాను,ముత్యాలకోవలానో
రాసిన ఉత్తరాలన్నింటిలో
ప్రేమాస్పదమైనపలుకులే
 పసిడివన్నెలనలదుకుంటున్నాయి..

దూరదూరతీరాల్లోంచి దిగంతాలకు
చేరువగానున్నట్లు నీ
మృదుస్వనం నన్ను అనుక్షణం
 పులకాంకితుడినిచేసే ప్రయత్నంలో
 పూర్తిగానిమగ్నమై వుంటున్నది...
మధురాతిమధురమైన మన సుమధుర
 జ్ఞాపకాలన్నీ
ఆ గులాబీ రంగుల కాగితపు మడతల్లో
తలదాచుకున్నట్లనిపిస్తున్నది నాకు..

నీవల్లిన ప్రతిపదబంధం నన్ను
నీ గుండెకు హత్తుకునేలాచేస్తూ
అనుభూతిప్రవాహంలో మునకలేసేలా
తీర్చిదిద్దుతున్నది..

అక్కడక్కడా కొన్ని అక్షరాలెందుకో అలుక్కుపోయినట్లుగా
నీ అశ్రుబిందువులతో తడిసి ముద్దయిపోయిన కారణంగానేమో
అస్తవ్యస్తంగా అల్లుకుపోయినట్లుగా నాకనులకు కట్టినట్లుగాతోస్తున్నది..


దూరాలను కలిపికుట్టే దివ్యమైన అస్త్రమేదో
  నీ గుండె గొంతులోకి
తొంగిచూస్తున్నదేమోనని నా ప్రగాఢ విశ్వాసం..

అప్పుడప్పుడూ కొనగోటితో నాకనులనిండిన నీటిబిందువులను తుడుచుకుంటూ ప్రేమసింధువుగా సాగుతున్న నీ అక్షర సముదాయాన్ని
హృదయగతం చేసుకుంటూ నీలేఖల్లోని సారాంశాన్ని
ఒడిసిపట్టుకునేప్రయత్నం చేస్తున్నాను..ఇక సెలవామరి..

శేషప్రశ్న
--------------------రావెల

అదృష్టమో,దురదృష్టమో
ఇతమిద్ధంగా బోధపడడంలేదు..
అవగాహనలేకుండానే ఈ లంపటంలోకి
జారి నేలబారుగా పడిపోయాను..
ప్రేమించిన హృదయానికిపెదవివిప్పి
తిరస్కరించలేక ఇలా ఇక్కడకు ఊడిపడ్డాను..

అప్పటికీ ఆత్మానుగతమైన అనుభూతి
అనుకున్నట్లుగానే సూచనలనందిస్తూనే వుంది..
పెడచెవిన పెట్టినట్లున్నాను ఫలితం అనుభవిస్తున్నాను.

ఇంత గాఢంగా విస్తరించుకునిపోయిన అసంతృప్తిలోనూ
అకాల వసంతోదయంలా అవతరించింది ఈ సంతాన సౌభాగ్యం
శిశిరంలోకి తొంగిచూడనివ్వకుండా కాపాడుకుంటూ వస్తున్న
అనురాగ బంధాల ఆత్మీయతానురాగాల పరంపర..
మనసునెలా సంబాళించుకోగలోనన్న సదసత్సంశయానికి
సమాధానంగా చిలుకపలుకులతోపలుకరించే చిన్నారి రామ చిలుకలు..
సం యమనంతో కాలంగడుపుకోవడమే చివరంటా వెంటపడి నడిపిస్తున్న
శేష ప్రశ్నకు గుప్పిట్లో దాచుకున్న గుట్టయిన సమాధానం
[ఒక ఆంగ్లకవితను నెమరువేసిన నేపధ్యంలో]
=======================================

Thursday, July 14, 2016

నిప్పచ్చరం
------------------రావెల


కనుచూపుమేరా పచ్చదనం
 కనుపించే దేశంలో
కాసులు గలగల
లాడుతూండడం ఘనకార్యమే గదా!
కాదనగలమా!!
వృక్షసం హారమే లక్ష్యంగా
చేసుకున్ననేలపైన
ఎండమావులు మాత్రమే కదులాడుతూండడం
భావ్యమే కదా !! కాదనగలమా!!
====================================
వాస్తవాధీన రేఖకు దూరంగా
---------------------------------------రావెల
ఉదయం తెల్లవారుతూనే
నీ నగుమోమే నాకు ఒకప్పుడు
స్వాగత వచనాలు పలికేది
సెల్ఫీలంటే తెలియనిరోజులో
నీ నగుమోమే ముందునిలిచిన చిత్రపటమై
నాముందు శోభస్కరంగా
సాక్షాత్కరించేది..

ఇప్పుడు యేదిశవైపు దృష్టిని
 సారించినా నా విషాద వదనమే
నన్ను ఎకసక్కాలాడుతూ ఏడిపిస్తున్నది..
మళ్ళీ నీ రాక అసంభవమనితెలిసినా
ఒక ఆశ్చర్య శోభితంగ
ఎనిమిదోప్రపంచపు వింతగా అలా
జరిగితే బాగుండునని
నా మనసు మౌన భాషలో
అభ్యర్ధనలనందిస్తున్నది..
=========================

Wednesday, July 13, 2016

నాటకానికి ముందువరసలో కూచుంటే
వారు అతి ముఖ్యమైన మనుషులని అర్ధం..
అలాగే సినిమా హాల్లో ఆఖరు వరుసలో
బాక్సులో కూర్చునే వారు ముఖ్యులని తెలుసుకదా
సినిమా మొదలుకాకముందే ట్రైలర్ ల హడావుడీ
అప్పుటిరోజుల్లో  సమాచార పౌరసంబంధాలవారి
 న్యూస్ రీల్ తప్పకవేయడం ఆనవాయితీ..
ఇక చక్క కుర్చీల్లో నల్లుల స్వైర విహారం..మొదలయేది..
హాలు యాజమాన్యమే ఈ యేర్పాటు చేసి నల్లులను
పెంపుడు కీటకాలుగా పోషిస్తున్నాయని నా విశ్వాసం..
దాని నివారణకు ఒక్కటే తరుణోపాయం..సగం చించిన టిక్కెట్ చూపిస్తేనే దూరంగా జరిగిపొయేవి,
పాసులతో సినిమా చూడాలని వచ్చిన పుర ప్రముఖులకు దండనగానేమొ  మరి ఈ యేర్పాటు..

=============================================

Tuesday, July 12, 2016

సత్యాసత్యాలమధ్య
     ----------------------      రావెల


కొన్ని నిజాలు
 విష గుళికల్లా వుంటాయి
గొంతుదాటి ససేమిరా
బయటకు   పొంగి పొర్లవు,,

కొన్ని అబద్ధాలు అమృతగుళికల్లా
మెరిసిపోతుంటాయి
ఊరకనే ఊరించి అయస్కాంతలా ఆకర్షించి
ఉచ్చులోకి దించేసి  ఉన్మాదినిగావించి
 ఇట్టే  తప్పుకుంటాయి..--

నవ్వుతూ గెంతుతూ గలగలలతో మనల్ను
మెప్పించి మురిపించే నయాగరా జలపాతాన్ని
ఇటీవల పిల్లల వేసంగి సెలవుల సందర్భంగా
కలిగింది.. ఇది కెనడా వైపు నుంచి దర్శించుకునే
సౌలభ్యం ఏర్పడడం రెండవసారి--2009 లో తనతో) పాటు
రెండవ కుమారుడు టొరంటో లో వుండగా వీసా తీసుకుని..
ఇప్పుడు ఒక్కడినే సుపుత్రుడు,కోడలు మనుమరాండ్రతో--
తన ఉత్సాహం, ఉద్వేగం, ఉత్తేజం యేమాత్రం తగ్గిన జాడలు కనపడలేదు.
ఆ సరసు ఒడ్డున విహరిస్తుంటే ఆశీర్వదిస్తూఉ దీవించిన అక్షతల ధోరణిలో తలపై పడుతున్న తుంపరలకు ఆబాలగోపాలం అమందానంద కందళిత హృదయరవిందులై మురిసి ముక్కలయిపోవడం ఖాయం.
.రాత్రి పది గంటలకు బాణాసంచా మెరుపులుఆకాశాన్ని ఆక్రమిస్తూ చేసిన అందమైన హంగామా!ఒహ్ వర్ణనాతీతం.. ప్రపంచపు అద్భుతపు వింతలలో ఎనిమిదవదిగాగుర్తించదగిన ఆశ్చర్యాద్భుతమైన అందమైన విహారంగా..జలపాతం..ఇది నిజం..
==================================
ఆ ముఖానికి ఆముఖం
==============================

ఆ ముఖంలో ఎప్పుడు చూసినా ఆ నవ్వు
నయాగరాజలపాతంలోని
శీతలస్పర్శాతుర తుషార బిందువుల్లా
తనువుకు చేరువై కిత కితలు పెడుతుంటుంది..

దిగులు రాత్రులన్నింటినీ దిగదుడిచిపారేసేఆనవ్వు
నవనవోన్మేషంగా విరాజిల్లుతూ వికసిత వదనంతో
నిత్య నూతనంగా విప్పారుతూ వుంటుంది..

ఆనవ్వుకోసమే వెన్నెలకూడా అప్పుడప్పుడూ
ముఖంచిన్నబుచ్చుకున్నట్లనిపిస్తుంది..
మధురాతిమధురమైన ఆనవ్వు అకస్మాత్తుగా
దూర దూరతీరాలకు సాగుతూ అదృశ్యమైపోతే
జీవితపు దారులన్నీ చీకటిగుయ్యారాల్లా
గాఢాంధకారమలముకుని కునారిల్లుతూ వుంటాయి..

ఆముఖానికి ఆముఖంగామిగిలిపోవాలన్న తలంపుతో
ఈ కవితకు ప్రాణంపోయాలన్న తలంపు కలిగింది అంతేసుమా!!
=======================